‏ 1 Kings 10

షేబ దేశపు రాణి సొలొమోనును దర్శించుట

1షేబ దేశపు రాణి సొలొమోను యొక్క ఖ్యాతి గురించి యెహోవాతో అతనికి ఉన్న సంబంధం గురించి విని చిక్కు ప్రశ్నలతో సొలొమోనును పరీక్షిద్దామని వచ్చింది. 2ఆమె ఒంటెల మీద సుగంధ ద్రవ్యాలను, చాలా బంగారం, వెలగల రాళ్లు ఎక్కించి, గొప్ప పరివారంతో బయలుదేరి యెరూషలేముకు చేరింది. ఆమె సొలొమోను దగ్గరకు వచ్చి, తన మనస్సులో ఉన్నదంతా చెప్పింది. 3సొలొమోను ఆమె ప్రశ్నలన్నిటికి జవాబులిచ్చాడు; వివరించలేనంత కష్టమైనది రాజుకు ఏది లేదు. 4షేబ రాణి సొలొమోనుకు ఉన్న జ్ఞానమంతటిని, అతడు కట్టించిన రాజభవనాన్ని, 5అతని భోజనబల్ల మీద ఆహారాన్ని, అతని అధికారుల కూర్చునే విధానాన్ని, ప్రత్యేక వస్త్రాలు ధరించి పరిచారం చేసే దాసులను, అతనికి పాత్ర అందించేవారిని, యెహోవా మందిరం వద్ద అతడు అర్పించే దహనబలులను చూసి ఆమె ఆశ్చర్యపడింది.

6ఆమె రాజుతో, “మీరు సాధించిన వాటి గురించి, మీ జ్ఞానం గురించి నా దేశంలో నేను విన్నది నిజమే. 7అయితే నేను వచ్చి కళ్ళారా చూసే వరకు వారి మాటలు నమ్మలేకపోయాను. నిజానికి, ఇక్కడున్న వాటిలో సగం కూడా నాకు చెప్పలేదు; జ్ఞానంలోను, ధనంలోను నేను విన్నదానికంటే మీరు ఎంతో గొప్పగా ఉన్నారు. 8మీ ప్రజలు
కొ.ప్రా.ప్ర.లలో మీ భార్యలు
ఎంత సంతోషంగా ఉంటారో! మీ ముందు నిలబడి మీ జ్ఞానాన్ని వింటున్న మీ అధికారులు ఎంత సంతోషంగా ఉంటారో!
9మీలో ఆనందిస్తూ, మిమ్మల్ని ఇశ్రాయేలు సింహాసనం మీద కూర్చోబెట్టిన మీ దేవుడైన యెహోవాకు స్తుతి కలుగును గాక! ఇశ్రాయేలు పట్ల ఆయనకున్న నిత్యమైన ప్రేమను బట్టి నీతిన్యాయాల ప్రకారం కార్యాలు జరిగించడానికి యెహోవా మిమ్మల్ని రాజుగా చేశారు” అని అభినందించింది.

10ఆమె రాజుకు 120 తలాంతుల
అంటే, సుమారు 4 1/2 టన్నులు
బంగారం, చాలా సుగంధద్రవ్యాలు, వెలగల రాళ్లు ఇచ్చింది. షేబ రాణి ఇచ్చినంత సుగంధద్రవ్యాలు రాజైన సొలొమోనుకు మరెప్పుడూ రాలేదు.

11(హీరాము ఓడలు ఓఫీరు నుండి బంగారాన్ని తెచ్చాయి; అక్కడినుండి వారు చాలా ఎర్ర చందనం చెక్కలు, వెలగల రాళ్లు తెచ్చారు. 12ఆ చందనం వాడి, వాటితో రాజు యెహోవా మందిరానికి, రాజభవనానికి స్తంభాలను, సంగీతకారులకు సితారలు వీణలు చేయించాడు. ఆ రోజు నుండి ఇంతవరకు అలాంటి చందనం దొరకలేదు కనబడలేదు.)

13రాజైన సొలొమోను షేబ రాణికి తన రాజ నిధి నుండి ఇచ్చింది మాత్రమే కాక, ఆమె కోరిందంతా, అడిగినదంతా ఇచ్చాడు. తర్వాత ఆమె తన పరివారంతో తన స్వదేశానికి వెళ్లిపోయింది.

సొలొమోను వైభవం

14సొలొమోనుకు సంవత్సరానికి వచ్చే బంగారం బరువు 666 తలాంతులు,
అంటే, సుమారు 25 టన్నులు
15అది వర్తకులు, వ్యాపారుల నుండి వచ్చింది కాక, అరేబియా రాజులందరి నుండి, దేశ అధికారుల నుండి కూడా రాబడి వస్తుంది.

16రాజైన సొలొమోను సాగగొట్టిన బంగారంతో రెండువందల పెద్ద డాళ్లను చేయించాడు; ప్రతి డాలుకు ఆరువందల షెకెళ్ళ
అంటే, సుమారు 6.9 కి. గ్రా. లు; 29 వచనంలో కూడా
బంగారం వినియోగించారు.
17సాగగొట్టిన బంగారంతో అతడు మూడువందల చిన్న డాళ్లు కూడా చేయించాడు, ప్రతి డాలుకు మూడు మీనాల
అంటే, సుమారు 1.7 కి. గ్రా. లు
బంగారం వినియోగించారు. రాజు వాటిని లెబానోను వనం అనే తన రాజభవనంలో ఉంచాడు.

18తర్వాత రాజు దంతంతో పెద్ద సింహాసనం చేయించి మేలిమి బంగారంతో పొదిగించాడు. 19సింహాసనానికి ఆరు మెట్లున్నాయి, దాని వెనుక భాగం గుండ్రంగా ఉంటుంది. సింహాసనానికి రెండు వైపులా చేతులు పెట్టుకోవడానికి ఉన్నాయి. వాటి దగ్గర రెండు సింహాలు నిలబడి ఉన్నాయి. 20ఆరు మెట్లమీద మెట్టుకు రెండు చొప్పున పన్నెండు సింహాలు ఇరువైపుల నిలబడి ఉన్నాయి. అలాంటిది మరే రాజ్యంలో తయారుచేయబడలేదు. 21రాజైన సొలొమోను పానపాత్రలన్నీ బంగారంతో చేసినవి, లెబానోను వనపు రాజభవనంలో ఉన్న పాత్రలన్నీ మేలిమి బంగారంతో చేసినవి. వెండితో ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే సొలొమోను కాలంలో వెండికి విలువలేదు. 22రాజుకు సముద్రంలో హీరాము ఓడలతో పాటు తర్షీషు నౌకలు
అంటే వాణిజ్య నౌకలు
కూడా ఉన్నాయి. అవి మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి.

23రాజైన సొలొమోను సంపదలో, జ్ఞానంలో లోకంలోని రాజులందరికంటే గొప్పవాడు. 24దేవుడు అతనికిచ్చిన జ్ఞానాన్ని వినడానికి లోకంలోని ప్రజలందరూ సొలొమోనును చూడాలని కోరుకున్నారు. 25ప్రతీ సంవత్సరం అతని దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరూ కానుకలుగా వెండి పాత్రలు, బంగారు పాత్రలు, వస్త్రాలు, యుద్ధాయుధాలు, సుగంధద్రవ్యాలు, గుర్రాలు, కంచరగాడిదలు తెచ్చేవారు.

26సొలొమోను రథాలను, గుర్రాలను సమకూర్చుకున్నాడు. అతనికి 1,400 రథాలు, 12,000 గుర్రాలు ఉన్నాయి, వీటిని రథాల పట్టణాల్లో, యెరూషలేములో తన దగ్గర ఉంచాడు. 27రాజు యెరూషలేములో వెండిని రాళ్లంత విస్తారంగా చేశాడు. దేవదారు మ్రానులను కొండ దిగువ ప్రదేశంలోని మేడిచెట్లలా అతి విస్తారంగా ఉంచాడు. 28సొలొమోను గుర్రాలను ఈజిప్టు నుండి, క్యూ
బహుశ కిలికియ
నుండి దిగుమతి చేసుకున్నారు. రాజ వర్తకులు తగిన ధర చెల్లించి వాటిని క్యూ దగ్గర కొనుగోలు చేశారు.
29వారు ఈజిప్టు నుండి ఒక్కో రథానికి ఆరువందల షెకెళ్ళ వెండిని, ఒక్కో గుర్రానికి నూట యాభై షెకెళ్ళ
అంటే, సుమారు 1.7 కి. గ్రా. లు
వెండిని ఇచ్చి దిగుమతి చేశారు. హిత్తీయుల రాజులందరికి, సిరియా
హెబ్రీలో అరాము
రాజులకు వాటిని ఎగుమతి కూడ చేశారు.
Copyright information for TelTSA