Isaiah 20
ఈజిప్టుకు కూషుకు వ్యతిరేకంగా ప్రవచనం
1అష్షూరు రాజైన సర్గోను తన సైన్యాధిపతిని పంపిన సంవత్సరంలో అతడు అష్డోదుకు వచ్చి, దానిపై దాడిచేసి దానిని స్వాధీనం చేసుకున్నాడు. 2ఆ సమయంలో యెహోవా ఆమోజు కుమారుడైన యెషయా ద్వారా మాట్లాడారు. ఆయన, “నీ నడుముకున్న గోనె పట్టాను, నీ పాదాలకున్న చెప్పులు తీసివేయి” అన్నారు. అతడు అలాగే చేసి, బట్టలు తీసివేసి చెప్పులు లేకుండా నడిచాడు. 3అప్పుడు యెహోవా, “నా సేవకుడైన యెషయా ఈజిప్టు గురించి, కూషు a గురించి సూచనగా సంకేతంగా మూడు సంవత్సరాలు బట్టలు, చెప్పులు లేకుండా తిరిగిన విధంగానే 4అష్షూరు రాజు చెరపట్టబడిన ఈజిప్టువారిని, కూషు బందీలను, పిల్లలను పెద్దలను బట్టలు లేకుండా చెప్పులు లేకుండా తీసుకు పోతాడు. ఈజిప్టువారిని అవమానం కలిగేలా వారి పిరుదుల కనిపించేలా వారిని తీసుకెళ్తాడు. 5కూషును నమ్ముకుని ఈజిప్టును బట్టి గర్వపడినవారు దిగులుపడి, సిగ్గుపడతారు. 6ఆ రోజున ఆ తీరప్రాంతంలో నివసించేవారు, ‘అష్షూరు రాజు చేతిలో నుండి విడుదల, సహయం కోసం మనం పారిపోయి ఆశ్రయించిన వారికి ఏమి జరిగిందో చూడండి! ఇప్పుడు మనమెలా తప్పించుకోగలం?’ అని అంటారు.”
Copyright information for
TelTSA