Isaiah 39
బబులోను నుండి రాయబారులు
1ఆ కాలంలో బలదాను కుమారుడును బబులోను రాజైన మర్దూక్-బలదాను హిజ్కియాకు జబ్బుచేసి, తిరిగి కోలుకున్నాడని విని అతనికి ఉత్తరాలు, కానుక పంపాడు. 2హిజ్కియా సంతోషంగా ఆ రాయబారులను ఆహ్వానించి, వారికి తన భవనంలో ఉన్న ఖజానాలోని వెండి, బంగారం, సుగంధద్రవ్యాలు, ఒలీవనూనెతో సహా ఆయుధాలు, ధనాగారాలలో ఉన్నవన్నీ వారికి చూపించాడు. తన భవనంలో గాని, రాజ్యమంతట్లో గాని హిజ్కియా వారికి చూపించనిదేది లేదు. 3తర్వాత రాజైన హిజ్కియా దగ్గరకు ప్రవక్తయైన యెషయా వెళ్లి, “ఆ మనుష్యులు ఏమి చెప్పారు? ఎక్కడి నుండి నీ దగ్గరకు వచ్చారు?” అని అడిగాడు. అందుకు హిజ్కియా, “వారు బబులోను అనే దూరదేశం నుండి వచ్చారు” అని జవాబిచ్చాడు. 4“నీ భవనంలో వారు ఏమేమి చూశారు?” అని ప్రవక్త అడిగాడు. హిజ్కియా, “నా భవనంలో ఉన్నవన్నీ చూశారు. నా ధనాగారంలో ఏదీ దాచకుండా అన్నీ వారికి చూపించాను” అన్నాడు. 5అప్పుడు యెషయా హిజ్కియాతో ఇలా అన్నాడు, “సైన్యాల యెహోవా వాక్కు విను: 6ఒక సమయం రాబోతుంది, నీ భవనంలో ఉన్నవన్నీ, ఈనాటి వరకు మీ పూర్వికుల కూడబెట్టినవన్నీ బబులోనుకు తీసుకెళ్తారు. ఇక్కడ ఏమీ మిగలదని యెహోవా చెప్తున్నారు. 7నీకు పుట్టబోయే నీ సంతానంలో కొంతమంది బబులోనుకు కొనిపోబడి బబులోను రాజు యొక్క రాజభవనంలో నపుంసకలుగా అవుతారు.” 8హిజ్కియా యెషయాతో, “నీవు చెప్పిన యెహోవా వాక్కు మంచిదే. నా జీవితకాలంలో సమాధానం సత్యం ఉంటాయి” అని అన్నాడు.
Copyright information for
TelTSA