‏ Psalms 137

1బబులోను నదుల దగ్గర మనం కూర్చుని
సీయోను పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుని ఏడ్చాము.
2దాని మధ్యన ఉన్న నిరవంజి చెట్లకు
మన సితారాలు తగిలించాము.
3మనల్ని పట్టుకున్నవారు పాటలు పాడమని మనల్ని అడిగారు,
మనల్ని బాధించినవారు సంతోష గానాలు కోరారు;
“సీయోను పాటల్లో ఒకటి పాడండి” అని అన్నారు.

4పరాయి దేశంలో ఉండగా
యెహోవా పాటలు మనం ఎలా పాడగలము?
5యెరూషలేమా! నేను నిన్ను మరచిపోతే,
నా కుడిచేయి దాని నేర్పును మరచిపోవాలి.
6నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే,
యెరూషలేము నాకు ఎక్కువ సంతోషం కలిగించేది
అని నేను భావించకపోతే
నా నాలుక నా అంగిలికి అంటుకుపోవాలి.

7యెహోవా, యెరూషలేము పడిపోయిన రోజున
ఎదోము ప్రజలు ఏమి చేశారో జ్ఞాపకం చేసుకోండి.
“దానిని నాశనం చేయండి.
పునాదుల వరకు దానిని ధ్వంసం చేయండి!” అని వారు అరిచారు.
8త్వరలో నాశనమవ్వబోతున్న బబులోను కుమారీ,
నీవు మాకు చేసిన కీడును బట్టి
నీకు ప్రతీకారం చేసేవాడు ధన్యుడు.
9మీ పసిపిల్లల్ని పట్టుకుని
వారిని బండకువేసి కొట్టేవాడు ధన్యుడు.
Copyright information for TelTSA