Psalms 28
దావీదు కీర్తన. 1యెహోవా, నేను మీకు మొరపెట్టుకుంటున్నాను;మీరు నా కొండయై ఉన్నారు,
నా మొరను నిర్లక్ష్యం చేయకండి.
ఒకవేళ మీరు మౌనంగా ఉంటే,
నేను గుంటలోకి దిగిపోయే వారిలా అవుతాను.
2నీ పరిశుద్ధాలయం వైపు
నా చేతులెత్తి,
కరుణ కొరకై నేను చేసే మొర
సహాయం కొరకై నేను చేసే ప్రార్థన ఆలకించండి.
3దుష్టులతో, చెడు చేసేవారితో పాటు
నన్ను లాక్కు వెళ్లకండి.
వారు పొరుగువారితో స్నేహపూర్వకంగా మాట్లాడతారు కాని,
వారి హృదయాల్లో దుర్మార్గం పెట్టుకుంటారు.
4వారి క్రియలకు
వారి చెడు పనికి తగ్గట్టుగా చెల్లించండి.
చేతులార వారు చేసిందానికి ప్రతీకారం చేయండి;
వారికి తగిన ప్రతిఫలమివ్వండి.
5యెహోవా క్రియలను గాని
ఆయన తన చేతులతో చేసిన వాటిని గాని వారు గ్రహించరు,
కాబట్టి ఆయన వారిని పడగొడతారు
మరలా వారిని నిలబెట్టరు.
6యెహోవా నా విజ్ఞాపన మొర విన్నారు
కాబట్టి ఆయనకు స్తుతి కలుగును గాక.
7యెహోవాయే నా బలం నా డాలు;
హృదయపూర్వకంగా ఆయనను నమ్మాను, నాకు సాయం దొరికింది.
నా హృదయం సంతోషంతో ఉప్పొంగి పోతుంది.
నా పాటతో నేను ఆయనను స్తుతిస్తాను.
8యెహోవాయే తన ప్రజలకు బలము.
తన అభిషిక్తుడికి ఆయనే రక్షణ దుర్గము.
9మీ ప్రజలను రక్షించండి మీ వారసత్వాన్ని దీవించండి;
వారికి కాపరివై ఎల్లప్పుడూ వారిని మోయండి.
Copyright information for
TelTSA