‏ Psalms 66

సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము.

1సర్వలోకమా! ఆనందంతో దేవునికి కేకలు వేయండి!
2ఆయన నామాన్ని కీర్తించండి
ఆయనను స్తుతించి మహిమపరచండి.
3దేవునితో ఇలా అనండి, “మీ క్రియలు ఎంత అద్భుతం!
మీ శక్తి ఎంతో గొప్పది కాబట్టి
మీ శత్రువులు భయంతో మీకు లొంగిపోతారు.
4సర్వ లోకం మీకు నమస్కరిస్తుంది;
మీకు స్తుతి పాడతారు
మీ నామాన్ని స్తుతిస్తారు.” సెలా

5దేవుడు ఏం చేశారో వచ్చి చూడండి,
మనుషులకు ఆయన చేసిన భీకరమైన క్రియలు చూడండి!
6సముద్రాన్ని ఆరిన నేలగా చేశారు,
వారు కాలినడకన నది దాటి వెళ్లారు
రండి, మనం ఆయనలో ఆనందిస్తాము.
7ఆయన తన శక్తితో నిత్యం పరిపాలిస్తారు,
ఆయన కళ్లు దేశాలను చూస్తాయి,
తిరుగుబాటు చేసేవారు తమను తాము హెచ్చించుకోకూడదు. సెలా

8సర్వజనులారా, మన దేవున్ని స్తుతించండి,
ఆయనను స్తుతిస్తున్న ధ్వని వినబడును గాక;
9ఆయన మనల్ని సజీవంగా ఉంచారు
మన పాదాలు జారిపోకుండ చేశారు.
10దేవా, మీరు మమ్మల్ని పరీక్షించారు;
వెండిలా మమ్మల్ని శుద్ధి చేశారు.
11మీరు మమ్మల్ని వలలో బంధించారు,
మా నడుముల మీద భారాన్ని మోపారు.
12మీరు మా తలలపై స్వారీ చేయడానికి ప్రజలను అనుమతించారు;
అగ్ని జలాల గుండా మేము వెళ్లాము,
అయినా మీరు మమ్మల్ని సమృద్ధిగల స్థలంలోనికి తెచ్చారు.

13దహన బలులతో మీ ఆలయానికి వచ్చి
నా మ్రొక్కుబడులు మీకు చెల్లిస్తాను.
14నేను శ్రమల్లో ఉన్నప్పుడు నా పెదవులు ప్రమాణం చేసిన,
నా నోరు పలికిన మ్రొక్కుబడులు చెల్లిస్తాను.
15నేను మీకు క్రొవ్విన జంతువులను
పొట్టేళ్ళను సువాసనగల దహనబలిగా అర్పిస్తాను;
నేను ఎద్దులను మేకలను అర్పిస్తాను. సెలా

16దేవుడంటే భయం భక్తి ఉన్నవారలారా, మీరంతా రండి వినండి;
ఆయన నా కోసం ఏం చేశారో మీకు చెప్తాను.
17నేను నా నోటితో ఆయనకు మొరపెట్టాను;
ఆయన స్తుతి నా నాలుక మీద ఉంది.
18నా హృదయంలో దుష్టత్వం ఉంటే,
ప్రభువు నా ప్రార్థన వినేవారు కాదు.
19కాని దేవుడు నిశ్చయంగా ఆలకించారు
నా ప్రార్థన విన్నారు.
20నా ప్రార్థనను త్రోసివేయని
తన మారని ప్రేమను నా నుండి తొలగించని,
దేవునికి స్తుతి కలుగును గాక!
Copyright information for TelTSA