Psalms 84
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన. 1సైన్యాల యెహోవా,మీ నివాసస్థలం ఎంత అందంగా ఉందో!
2యెహోవా ఆలయ ఆవరణంలో ప్రవేశించాలని,
నా ప్రాణం ఎంతగానో కోరుతుంది సొమ్మసిల్లుతుంది;
సజీవుడైన దేవుని కోసం
నా హృదయం నా శరీరం ఆనందంతో కేకలు వేస్తున్నాయి.
3సైన్యాల యెహోవా, నా రాజా నా దేవా,
మీ బలిపీఠం దగ్గరే,
పిచ్చుకలకు నివాసం దొరికింది,
వాన కోయిలకు గూడు దొరికింది,
అక్కడే అది తన పిల్లలను పెంచుతుంది.
4మీ మందిరంలో నివసించేవారు ధన్యులు;
వారు నిత్యం మిమ్మల్ని స్తుతిస్తారు. సెలా
5మీ నుండి బలం పొందే మనుష్యులు ధన్యులు,
వారి హృదయాలు సీయోనుకు వెళ్లే రహదారుల మీదే ఉంటాయి.
6వారు బాకా లోయ గుండా వెళ్తున్నప్పుడు,
వారు దానిని ఊటల ప్రదేశంగా మారుస్తారు;
తొలకరి వాన దానిని ఆశీర్వాదాలతో ▼
▼లేదా కొలనూలు
కప్పివేస్తుంది.7వారిలో ప్రతిఒక్కరు సీయోనులో దేవుని సన్నిధిలో కనబడే వరకు
వారి బలం అధికమవుతుంది.
8సైన్యాల యెహోవా దేవా, నా ప్రార్థన వినండి;
యాకోబు దేవా, ఆలకించండి. సెలా
9మా డాలువైన ▼
▼లేదా ప్రభువా
ఓ దేవా! మా వైపు చూడండి;మీ అభిషిక్తునిపై దయ చూపండి.
10బయట గడిపిన వెయ్యి దినాలకంటే
మీ మందిరంలో ఒక్కరోజు గడపడం మేలు.
దుష్టుల గుడారాల్లో నివసించడం కంటే
నేను నా దేవుని మందిరంలో ఒక ద్వారపాలకునిగా ఉండడం నాకిష్టము.
11యెహోవా దేవుడు మాకు సూర్యుడు డాలు;
యెహోవా దయను ఘనతను అనుగ్రహిస్తారు;
నిందారహితులుగా నడుచుకునే వారికి
ఆయన ఏ మేలు చేయకుండ మానరు.
12సైన్యాల యెహోవా,
మీయందు నమ్మకముంచే మనుష్యులు ధన్యులు.
Copyright information for
TelTSA