Psalms 11
సంగీత దర్శకునికి.దావీదు కీర్తన. 1నేను యెహోవాను ఆశ్రయించాను.“పక్షిలా మీ కొండ మీదికి పారిపో.
2దుష్టులు తమ విల్లును ఎక్కుపెట్టారు,
చీకటిలో పొంచి ఉండి
యథార్థ హృదయుల పైకి వేయడానికి
బాణాలు సిద్ధం చేస్తున్నారు.
3పునాదులు నాశనమై పోతుంటే,
నీతిమంతులు ఏం చేయగలరు?”
అని నాతో మీరెలా అంటారు?
4యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నారు;
యెహోవా తన పరలోక సింహాసనంపై ఆసీనులై ఉన్నారు;
ఆయన భూమి మీద నరులను పరిశీలిస్తున్నారు;
ఆయన కళ్లు వారిని పరీక్షిస్తున్నాయి.
5యెహోవా నీతిమంతులను పరీక్షిస్తారు,
కాని దుష్టులను, దౌర్జన్యాన్ని ప్రేమించేవారిని
ఆయన అసహ్యించుకుంటారు.
6దుష్టుల మీద ఆయన
నిప్పు కణాలు అగ్ని గంధకం కురిపిస్తారు;
వడగాలి వారి భాగం అవుతుంది.
7యెహోవా నీతిమంతుడు,
ఆయన న్యాయాన్ని ప్రేమిస్తారు;
యథార్థవంతులు ఆయన ముఖాన్ని చూస్తారు.
Copyright information for
TelTSA