‏ Psalms 14

సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.

1“దేవుడు లేడు”
అని మూర్ఖులు
నైతికంగా లోపం ఉన్నవారు
తమ హృదయంలో అనుకుంటారు.
వారు అవినీతిపరులు, వారి క్రియలు నీచమైనవి;
మంచి చేసేవారు ఒక్కరు లేరు.

2వివేకం కలిగి దేవున్ని వెదకేవారు ఎవరైనా ఉన్నారా
అని యెహోవా పరలోకం నుండి
మనుష్యులందరిని పరిశీలించి చూస్తున్నారు.
3అందరు దారి తప్పి చెడిపోయారు;
మంచి చేసేవారు ఎవరూ లేరు.
ఒక్కరు కూడా లేరు.

4కీడుచేసే వీరందరికి ఏమీ తెలీదా?

వారు రొట్టె తింటున్నట్లు నా ప్రజలను మ్రింగివేస్తున్నారు;
వారు ఎన్నడు యెహోవాకు మొరపెట్టరు.
5వారు అక్కడ, భయంతో మునిగిపోయి ఉన్నారు,
ఎందుకంటే దేవుడు నీతిమంతుల గుంపులో ఉన్నారు.
6కీడుచేసేవారైన మీరు పేదల ఆలోచనలకు భంగం కలుగజేస్తారు,
కాని యెహోవా వారి ఆశ్రయము.

7సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ వస్తుంది;
యెహోవా తన ప్రజలను తిరిగి రప్పించినప్పుడు,
యాకోబు సంతోషించును గాక ఇశ్రాయేలు ఆనందంగా ఉండును గాక!
Copyright information for TelTSA