‏ Psalms 144

దావీదు కీర్తన.

1నా కొండయైన యెహోవాకు స్తుతి కలుగును గాక,
యుద్ధము కోసం నా చేతులకు శిక్షణ,
నా వ్రేళ్ళకు పోరాటం నేర్పారు.
2ఆయన నా ప్రేమగల దేవుడు, నా కోట,
నా బలమైన కోట, నన్ను విడిపించేవారు.
ఆయనే ప్రజలను నాకు లోబరచే,
నా డాలు నా ఆశ్రయము.

3యెహోవా, మనుష్యులు ఏపాటివారని లక్ష్యపెడుతున్నారు?
వారి గురించి ఆలోచించడానికి మనుష్యులు ఏపాటివారు?
4నరులు కేవలం ఊపిరిలాంటివారు;
దాటిపోయే నీడలా వారి రోజులు ఉంటాయి.

5యెహోవా ఆకాశాలను చీల్చుకొని క్రిందికి దిగిరండి;
పర్వతాలు పొగలు వదిలేలా, వాటిని ముట్టండి.
6మెరుపులు పంపించండి శత్రువులను చెదరగొట్టండి;
బాణాలు వేసి వారిని ఓడించండి.
7పైనుండి మీ చేయి చాపండి;
గొప్ప జలాల నుండి,
విదేశీయుల చేతుల్లో నుండి,
నన్ను విడిపించండి.
8వారి నోళ్ళ నిండ అబద్ధాలు,
వారి కుడి చేతులు మోసకరమైనవి.

9నా దేవా, మీకు ఒక క్రొత్త పాట పాడతాను.
పదితంతు వీణతో మీకు సంగీతం చేస్తాను.
10రాజులకు విజయమిచ్చేది,
మీ సేవకుడైన దావీదును రక్షించేది మీరే.

భయంకరమైన ఖడ్గము నుండి
11నన్ను విడిపించండి;
విదేశీయుల చేతుల నుండి నన్ను కాపాడండి
వారి నోళ్ళ నిండ అబద్ధాలు,
వారి కుడి చేతులు మోసకరమైనవి.

12అప్పుడు మా పిల్లలు పెరిగిన మొక్కల్లా,
తమ యవ్వన దశలో ఉంటారు.
మా కుమార్తెలు,
రాజభవనం అలంకరించడం కోసం చెక్కబడిన స్తంభాల్లా ఉంటారు.
13మా కొట్లు
అన్ని రకాల ధాన్యాలతో నిండి ఉంటాయి.
మా పచ్చికబయళ్లలో గొర్రెల మందలు
వేలల్లో, పది వేలల్లో విస్తరిస్తాయి.
14మా ఎద్దులు బాగా బరువులు మోస్తాయి.
గోడలు నాశనం కాకూడదు.
చెరలోనికి వెళ్లకూడదు
దుఃఖ ధ్వని వీధుల్లో వినబడ కూడదు.
15ఇలాంటి స్థితిని అనుభవించే ప్రజలు ధన్యులు;
యెహోవా తమకు దేవునిగా కలిగి ఉండే ప్రజలు ధన్యులు.
Copyright information for TelTSA