‏ Psalms 21

సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.

1యెహోవా! మీ బలంలోనే రాజు ఆనందిస్తాడు.
మీ రక్షణను బట్టి అతడు ఎంతో సంతోషిస్తాడు!

2అతని హృదయ కోరికను మీరు తీర్చారు
అతని పెదవుల నుండి వచ్చిన మనవిని మీరు ఇవ్వక మానలేదు. సెలా
3మీరు అతనిని గొప్పగా ఆశీర్వదించారు
మేలిమి బంగారు కిరీటం అతని తలపై పెట్టారు.
4అతడు మిమ్మల్ని ఆయుష్షును అడుగగా,
మీరు అతనికి శాశ్వతకాలం ఉండే దీర్ఘాయువును ఇచ్చారు.
5మీరు ఇచ్చిన విజయాల వలన అతని గొప్ప కీర్తి కలిగింది;
మీరు ఘనతా ప్రభావాలతో అతడిని అలంకరించారు.
6నిశ్చయంగా మీరు అతనికి శాశ్వతమైన ఆశీర్వాదాలు ఇచ్చారు
మీ సన్నిధిలోని ఆనందంతో అతన్ని సంతోష పెట్టారు.
7రాజు యెహోవాను నమ్ముతాడు;
మహోన్నతుని మారని ప్రేమను బట్టి
అతడు కదలకుండ స్థిరంగా ఉంటాడు.

8మీ చేయి మీ శత్రువులందరినీ పట్టుకుంటుంది;
మీ కుడిచేయి మీ శత్రువులను ఆక్రమిస్తుంది.
9మీరు యుద్ధం చేయడానికి ప్రత్యక్షమైనప్పుడు,
మీరు వారిని అగ్నిగుండంలో కాల్చివేస్తారు.
యెహోవా తన ఉగ్రతతో వారిని మ్రింగివేస్తారు,
ఆయన అగ్ని వారిని దహించి వేస్తుంది.
10భూమి మీద వారి సంతానాన్ని మీరు నిర్మూలం చేస్తారు,
నరులలో వారి సంతతిని నిర్మూలం చేస్తారు.
11వారు మీకు వ్యతిరేకంగా కీడు చేయాలని కుట్రపన్నినా
దుష్ట పన్నాగాలు వేసినా, వారు విజయం సాధించలేరు.
12మీరు వారివైపు గురి చూసి విల్లు ఎక్కుపెట్టి
వారు వెనుతిరిగి వెళ్లేలా చేయగలరు.

13యెహోవా, మీ బలంలో మీరు లేవండి;
మీ శక్తిని గురించి మేము పాడి స్తుతిస్తాము.
Copyright information for TelTSA