‏ Psalms 23

దావీదు కీర్తన

1యెహోవా నా కాపరి, నాకు ఏ కొరత లేదు.
2పచ్చిక ఉన్నచోట ఆయన నన్ను పడుకోనిస్తారు.
ప్రశాంత జలాల ప్రక్కన ఆయన నన్ను నడిపిస్తారు.
3ఆయన నా ప్రాణానికి సేదదీరుస్తారు.
ఆయన తన నామం కోసం
నీతి మార్గాల్లో నన్ను నడిపిస్తారు.
4మృత్యు నీడలా ఉన్న లోయలో
లేదా గాఢాంధకారపు లోయలో

నేను నడిచినా,
ఏ కీడుకు భయపడను,
ఎందుకంటే మీరు నాతో ఉన్నారు;
మీ దండం మీ చేతికర్ర
నన్ను ఆదరిస్తాయి.

5నా శత్రువులు ఉన్న చోటనే
మీరు నాకు బల్ల సిద్ధం చేస్తారు.
నూనెతో నా తల అభిషేకించారు;
నా పాత్ర నిండి పొర్లుతుంది.
6నిశ్చయంగా నా జీవితకాలమంతా
మీ మంచితనం మీ మారని ప్రేమ నావెంటే ఉంటాయి.
నేను నిరంతరం
యెహోవా మందిరంలో నివసిస్తాను.
Copyright information for TelTSA