‏ Ezra 4:8-24

8ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, యెరూషలేము వారి మీద ఫిర్యాదు చేస్తూ రాజైన అర్తహషస్తకు ఇలా ఉత్తరం వ్రాశారు:

9ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, వారి తోటి ఉద్యోగులు అనగా పర్షియా, ఎరెకు, బబులోను, షూషనుకు చెందిన ఏలామీయుల న్యాయాధిపతులు, అధికారులు, 10గొప్పవాడు గౌరవనీయుడైన ఆస్నప్పరు
ఆషుర్బనిపలు ఆస్నప్పరు యొక్క మరొక రూపం
విడుదల చేయగా, సమరయ పట్టణంలో యూఫ్రటీసు నదిని అవతల నివసించే ఇతర ప్రజలు వ్రాస్తున్న ఉత్తరము.

11(ఇది వారు రాజుకు వ్రాసిన ఉత్తరానికి నకలు.)

రాజైన అర్తహషస్తకు,

యూఫ్రటీసు నది అవతల ఉంటున్న మీ సేవకులు వ్రాస్తున్న ఉత్తరము.

12రాజైన మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, మీ దగ్గర నుండి మా దగ్గరకు వచ్చిన యూదులు యెరూషలేముకు వచ్చి తిరుగుబాటు చేసిన ఆ చెడ్డ పట్టణాన్ని తిరిగి కడుతున్నారు. వారు గోడలను మరలా కడుతూ పునాదులను మరమ్మత్తు చేస్తున్నారు.

13అంతేకాక, మీరు తెలుసుకోవలసింది ఏంటంటే, ఒకవేళ వీరే ఈ పట్టణాన్ని కట్టి దాని ప్రాకారాలు తిరిగి నిర్మిస్తే వారు పన్నులు గాని కప్పం గాని లేదా సుంకం గాని చెల్లించరు. తద్వారా రాజ్య ఆదాయానికి నష్టం కలుగుతుంది. 14మేము రాజుకు కట్టుబడి ఉన్నాం కాబట్టి రాజుకు అవమానం జరిగితే చూడలేము. అందుకే రాజుకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నాము. 15మీ పూర్వికులు వ్రాసిన చరిత్రను పరిశీలన చేయండి. వాటిలో ఈ పట్టణస్థులు తిరుగుబాటుదారులని, రాజులకు దేశాలకు హాని చేశారని, దేశద్రోహులని తెలుస్తుంది. ఆ కారణంగానే ఆ పట్టణం నాశనం అయ్యింది. 16వీరు ఈ పట్టణాన్ని కట్టి దాని గోడలను మరలా కడితే, యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో ఏది కూడా మీ ఆధీనంలో ఉండదని రాజుకు తెలియజేస్తున్నాము.

17దానికి రాజు ఇచ్చిన సమాధానం ఇది:

ప్రభుత్వ అధికారి రెహూము, కార్యదర్శి షింషయి, సమరయలో యూఫ్రటీసు నది అవతలి ప్రాంతంలో నివసించేవారి సహోద్యోగులకు:

శుభాలు.

18మీరు మాకు పంపిన ఉత్తరాన్ని నా ఎదుట చదివి అనువదించారు. 19నా ఆజ్ఞ ప్రకారం పరిశోధించగా ఈ పట్టణానికి రాజులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన సుదీర్ఘ చరిత్ర ఉందని, అది తిరుగుబాటుకు దేశద్రోహానికి స్థానమని తెలిసింది. 20గతంలో యెరూషలేమును పరిపాలించిన బలమైన రాజుల ఆధీనంలోనే యూఫ్రటీసు నది అవతలి ప్రాంతమంతా ఉండేది. వారికి పన్నులు, కప్పం, సుంకం చెల్లించేవారు. 21ఇప్పుడు అక్కడ ఉన్నవారు తమ పనిని వెంటనే ఆపి మరలా నేను ఆజ్ఞ ఇచ్చేవరకు ఆ పట్టణాన్ని తిరిగి కట్టకూడదని ఆదేశం జారీ చేయండి. 22ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ఉండండి. రాజ్య ప్రయోజనాలకు నష్టం వాటిల్లే ప్రమాదం జరగడానికి ఎందుకు అనుమతించాలి?

23రాజైన అర్తహషస్త పంపించిన ఉత్తరం నకలు రెహూము, షింషయి వారి తోటి ఉద్యోగులకు చదివి వినిపించిన వెంటనే వారు యెరూషలేములోని యూదుల దగ్గరకు వెళ్లి పని చేయడం ఆపమని బలవంతం చేశారు.

24కాబట్టి యెరూషలేములో జరుగుతున్న దేవుని మందిరం పని ఆగిపోయింది. పర్షియా రాజైన దర్యావేషు హయాములో రెండవ సంవత్సరం వరకు పని ఆగిపోయింది.

‏ Ezra 5

దర్యావేషుకు ఉత్తరం వ్రాసిన తత్తెనై

1ప్రవక్తయైన హగ్గయి ఇద్దోకు వారసుడు, ప్రవక్తయైన జెకర్యా యూదాలో, యెరూషలేములో ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా పేరట ప్రవచించారు. 2అప్పుడు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు, యోజాదాకు కుమారుడైన యెషూవ, యెరూషలేములో దేవుని మందిరాన్ని మళ్ళీ కట్టించడం మొదలుపెట్టారు. దేవుని ప్రవక్తలు వారితో ఉండి వారికి మద్ధతు ఇచ్చారు.

3ఆ సమయంలో యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు వారి దగ్గరకు వెళ్లి, “ఈ మందిరాన్ని మరలా కట్టి దానిని పూర్తి చేయడానికి మీకు ఎవరు అనుమతిచ్చారు?” అని వారిని ప్రశ్నించారు. 4అంతే కాకుండా, “ఈ భవనాన్ని కడుతున్న వారి పేర్లు ఏమిటి?” అని కూడా అడిగారు. 5అయితే వారి దేవుని దృష్టి యూదుల పెద్దలను కాపాడుతూ ఉంది కాబట్టి ఈ సమాచారం దర్యావేషుకు చేరి అతని దగ్గర నుండి వ్రాతపూర్వక జవాబు వచ్చేవరకు వారు పని చేయడం ఆపలేదు.

6యూఫ్రటీసు నది అవతల అధిపతిగా ఉన్న తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు రాజైన దర్యావేషుకు పంపిన ఉత్తరం నకలు ఇది. 7వారు పంపిన సమాచారం ఇలా ఉంది:

రాజైన దర్యావేషుకు:

హృదయపూర్వక శుభాలు.

8రాజు తెలుసుకోవలసింది ఏంటంటే, మేము యూదా జిల్లాకు అక్కడ ఉన్న గొప్ప దేవుని ఆలయానికి వెళ్లాము. ప్రజలు దానిని పెద్ద రాళ్లతో కడుతున్నారు, గోడలకు దూలాలు అమరుస్తున్నారు. వారి ఆధ్వర్యంలో పనులు శ్రద్ధతో, శరవేగంగా జరుగుతున్నాయి.

9మేము అక్కడి పెద్దలను, “ఈ మందిరాన్ని తిరిగి కట్టడానికి, దానిని పూర్తి చేయడానికి మీకు అనుమతి ఎవరు ఇచ్చారు?” అని ప్రశ్నించాము. 10అంతే కాకుండా వారి నాయకుల పేర్లు వివరాలు మీకు అందించడానికి వారి పేర్లను కూడా అడిగి తెలుసుకున్నాము.

11వారు మాకిచ్చిన జవాబు ఇది:

“మేము భూమ్యాకాశాల దేవుని సేవకులము. చాలా సంవత్సరాల క్రిందట ఇశ్రాయేలీయులలో ఒక గొప్ప రాజు కట్టించి పూర్తి చేసిన మందిరాన్ని మేము తిరిగి కడుతున్నాము.
12మా పూర్వికులు పరలోక దేవునికి కోపం తెప్పించారు కాబట్టి ఆయన వారిని బబులోను రాజు, కల్దీయుడైన నెబుకద్నెజరు చేతికి అప్పగించారు, అతడు ఈ మందిరాన్ని నాశనం చేసి ప్రజలను బందీలుగా బబులోను తీసుకెళ్లాడు.

13“అయినా, బబులోను రాజైన కోరెషు హయాములో మొదటి సంవత్సరంలో రాజైన కోరెషు ఈ దేవుని మందిరాన్ని మరలా కట్టడానికి శాసనం జారీ చేశాడు. 14అంతేకాదు గతంలో నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోను క్షేత్రానికి
లేదా రాజభవనం
తీసుకెళ్లిన దేవుని మందిరపు వెండి బంగారు వస్తువులను రాజైన కోరెషు బబులోను క్షేత్రంలో నుండి తెప్పించి, తాను అధిపతిగా నియమించిన షేష్బజ్జరుకు వాటిని ఇచ్చి,
15అతనితో అన్నాడు, ‘నీవు ఈ వస్తువులను తీసుకెళ్లి యెరూషలేములోని మందిరంలో ఉంచాలి. ఆ స్థలంలో దేవుని మందిరాన్ని తిరిగి కట్టించాలి.’

16“కాబట్టి ఈ షేష్బజ్జరు వచ్చి యెరూషలేములో దేవుని ఆలయానికి పునాది వేశాడు. అప్పటినుండి నేటివరకు దాన్ని కడుతున్నాము కాని అది ఇంకా పూర్తి కాలేదు.”

17ఇది రాజుకు ఇష్టమైతే, యెరూషలేములో దేవుని మందిరాన్ని నిర్మించడానికి రాజైన కోరెషు ఆదేశం ఇచ్చాడో లేదో తెలుసుకోవడానికి బబులోను రాజ్య దస్తావేజులను పరిశోధించండి. అప్పుడు ఈ విషయంలో రాజు నిర్ణయాన్ని మాకు తెలియచేయాలని కోరుతున్నాము.

‏ Ezra 6:1-18

దర్యావేషు ఆదేశం

1అప్పుడు రాజైన దర్యావేషు ఆదేశించగా వారు బబులోను ఖజానాలోని రాజ్య దస్తావేజులన్ని పరిశోధించారు. 2మాదీయ ప్రాంతంలో ఉన్న ఎక్బతానా కోటలో ఒక గ్రంథపుచుట్ట దొరికింది. దాని మీద ఇలా వ్రాసి ఉంది:

వ్రాతపూర్వక సందేశము:

3రాజైన కోరెషు పాలనలో మొదటి సంవత్సరంలో యెరూషలేములోని దేవుని దేవాలయం గురించి రాజు జారీ చేసిన శాసనం:

బలులు అర్పించే స్థలంగా మందిరాన్ని తిరిగి కట్టాలి, దాని పునాదులు వేయాలి. దాని ఎత్తు అరవై మూరలు,
అంటే, సుమారు 27 మీటర్లు
వెడల్పు అరవై మూరలు ఉండాలి.
4పెద్ద రాళ్లతో మూడు వరుసలు, క్రొత్త కలపతో ఒక వరుస పెట్టి కట్టాలి. దానికయ్యే ఖర్చు రాజ్య ఖజానా నుండి చెల్లించాలి. 5అంతేకాక, నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయం నుండి బబులోనుకు తీసుకువచ్చిన దేవుని ఆలయానికి సంబంధించిన వెండి బంగారు వస్తువులను తిరిగి యెరూషలేము దేవాలయానికి తీసుకెళ్లి వాటి స్థానాల్లో పెట్టాలి; వాటిని దేవుని మందిరంలోనే ఉంచాలి.

6అందుకు ఇప్పుడు, యూఫ్రటీసు నది అవతల అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి వారి సహోద్యోగులు దీనికి దూరంగా ఉండాలి. 7దేవుని ఆలయ పనికి ఆటంకం కలిగించకూడదు. యూదుల అధిపతిని, యూదుల పెద్దలను దేవుని మందిరాన్ని దాని స్థానంలో కట్టనివ్వండి.

8అంతేకాక, దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి ఈ యూదుల పెద్దలకు మీరు అందించవలసిన సహాయం గురించి కూడా నేను మీకు ఆదేశం ఇస్తున్నాను:

యూఫ్రటీసు నది అవతల నుండి రాజ ఖజానాకు వచ్చిన పన్నుల నుండి వారి ఖర్చులన్నిటిని చెల్లించాలి, తద్వారా వారి పని ఆగదు.
9వారికి అవసరమైన వాటిని అనగా పరలోక దేవునికి దహనబలులు అర్పించడానికి దూడలు, పొట్టేళ్లు, గొర్రెపిల్లలు యెరూషలేములోని యాజకులు అడిగే గోధుమలు, ఉప్పు, ద్రాక్షరసం, ఒలీవనూనె, ప్రతిరోజు క్రమం తప్పకుండా వారికి అందించాలి. 10తద్వారా వారు బలులు అర్పించి పరలోక దేవుని సంతోషపరచి రాజు, అతని కుమారుల క్షేమం గురించి ప్రార్థిస్తారు.

11అంతేకాక, నా ఆదేశం ఏంటంటే, ఎవరైనా ఈ ఆజ్ఞ పాటించకపోతే వారి ఇంటి నుండి దూలాన్ని తీసి దానికి వారిని ఉరితీయాలి. ఈ నేరం బట్టి వారి ఇంటిని చెత్తకుప్పగా చేయాలి. 12ఏ రాజైన ఏ ప్రజలైనా ఈ ఆజ్ఞను మీరి యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తే తన నామాన్ని అక్కడ ఉంచిన దేవుడు వారిని పడగొట్టును గాక.

దర్యావేషు అనే నేను ఆదేశిస్తున్నాను. దీనిని ఖచ్చితంగా శ్రద్ధతో పాటించాలి.

ఆలయ నిర్మాణం పూర్తి ప్రతిష్ఠించుట

13తర్వాత, రాజైన దర్యావేషు పంపించిన శాసనం ప్రకారం, యూఫ్రటీసు నది అవతలి అధిపతియైన తత్తెనై, షెతర్బోజ్నయి, వారి సహోద్యోగులు పని చేయించారు. 14ప్రవక్తయైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జెకర్యాల ప్రవచనాలను బట్టి యూదుల పెద్దలు పనిని సక్రమంగా కొనసాగించారు. ఇశ్రాయేలీయుల దేవుని ఆజ్ఞ ప్రకారం పర్షియా రాజులైన కోరెషు, దర్యావేషు, అర్తహషస్తల ఆదేశాలను అనుసరించి వారు మందిరాన్ని కట్టడం ముగించారు. 15రాజైన దర్యావేషు పాలనలోని ఆరవ సంవత్సరంలో అదారు నెల మూడవ రోజున మందిరం పూర్తి అయ్యింది.

16అప్పుడు ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు చెర నుండి విడుదలై వచ్చిన వారందరు కలిసి ఆనందంతో మందిరాన్ని ప్రతిష్ఠించారు. 17దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించడానికి వారు ఆ రోజున వంద ఎడ్లు, రెండువందల పొట్టేళ్లు, నాలుగువందల గొర్రెపిల్లలు, ఇశ్రాయేలీయులందరి కోసం పాపపరిహారబలిగా
లేదా శుద్ధీకరణ అర్పణ
ఇశ్రాయేలీయుల గోత్రాల లెక్క చొప్పున పన్నెండు మేకపోతులను బలి అర్పించారు.
18యెరూషలేములో దేవుని సేవ చేయడానికి మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారం వారి వారి తరగతుల ప్రకారం యాజకులను వారివారి వరుసల ప్రకారం లేవీయులను నియమించారు.
Copyright information for TelTSA