‏ Proverbs 31:10-31

ముగింపు: గుణవతియైన భార్య

10
31:10-31 వచనాలు ఒక అక్రోస్టిక్ పద్యం, ఇందులోని ప్రతి వచనం హెబ్రీ వర్ణమాలకు చెందిన వరుస అక్షరాలతో మొదలవుతాయి
గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు?
ఆమె ముత్యాల కంటే విలువైనది.
11ఆమె భర్త ఆమెపై పూర్తి నమ్మిక కలిగి ఉంటాడు
అతనికి లాభం తక్కువకాదు.
12ఆమె బ్రతుకు దినాలన్ని,
అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.
13ఆమె గొర్రె ఉన్నిని నారను తెచ్చుకుని,
ఆసక్తి కలిగి తన చేతులతో పని చేస్తుంది.
14ఆమె దూరము నుండి తన ఆహారాన్ని తెచ్చే,
వర్తకుల ఓడల లాంటిది.
15ఆమె ఇంకా చీకటి ఉండగానే లేస్తుంది;
తన కుటుంబానికి భోజనము సిద్ధము చేస్తుంది;
తన పనికత్తెలకు వారి వాటాను ఇస్తుంది.
16ఆమె పొలాన్ని చూసి దానిని కొంటుంది;
తన సంపాదనల నుండి ఆమె ద్రాక్షతోట ఒకటి నాటుతుంది.
17ఆమె తన పనిని తీవ్రంగా ప్రారంభిస్తుంది,
ఆమె పనులకు తగినట్టుగా ఆమె చేతులు బలమైనవి.
18ఆమె తన వ్యాపారం లాభదాయకంగా ఉండడం చూస్తుంది,
రాత్రివేళ ఆమె దీపం ఆరిపోదు.
19ఆమె పంటను చేత పట్టుకుంటుంది,
తన వ్రేళ్ళతో కదురు పట్టుకుని వడుకుతుంది.
20పేదవారికి తన చేయి చాపి సహాయం చేస్తుంది,
దరిద్రులకు తన చేతులు చాపి సహాయపడుతుంది.
21మంచు కురిసినప్పుడు ఆమె తన ఇంటివారి గురించి భయపడదు,
ఆమె ఇంటివారందరు ఎర్రని రంగు బట్టలు వేసుకున్నవారు.
22ఆమె పరుపులను తయారుచేసుకుంటుంది,
ఆమె బట్టలు సన్నని నారబట్టలు ఎరుపు వస్త్రాలు.
23ఆమె భర్త పట్టణ ద్వారం దగ్గర గౌరవించబడతాడు,
అతడు దేశ పెద్దల మధ్య ఆసీనుడై ఉంటాడు.
24ఆమె నారబట్టలు నేయించి అమ్ముతుంది,
వర్తకులకు నడికట్లను అమ్ముతుంది.
25బలాన్ని, గౌరవాన్ని ఆమె ధరించి ఉంది;
ఆమె రాబోయే రోజుల గురించి నవ్వగలదు.
26ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది,
దయగల ఉపదేశం ఆమె నాలుకపై ఉంటుంది.
27ఆమె తన ఇంటివారి వ్యవహారాలను చూస్తుంది,
పని చేయకుండ ఆమె భోజనం చేయదు.
28ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అని పిలుస్తారు;
ఆమె భర్త కూడా, ఆమెను పొగడ్తారు:
29“చాలామంది స్త్రీలు గొప్ప పనులు చేస్తారు,
కాని వారందరినీ నీవు మించినదానవు.”
30అందం మోసకరం ఆకర్షణ వ్యర్థం;
యెహోవాయందు భయభక్తులు గల స్త్రీ పొగడబడుతుంది.
31చేసే పనిని బట్టి ఆమెకు గుర్తింపు వస్తుంది,
ప్రజల ఎదుట ఆమె పనులు ఆమెను పొగడుతాయి.
Copyright information for TelTSA